‘బ్లాక్’లో లేఆఫ్స్ బాంబు.. ఏకంగా 4,000 మంది ఇంటికి

ట్విట్టర్ మాజీ సీఈవో జాక్ డోర్సేకు చెందిన ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ 'బ్లాక్' టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టించింది. లాభాల్లో నడుస్తున్నప్పటికీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) వాడకాన్ని పెంచే ఉద్దేశంతో ఏకంగా 4,000 మందికి పైగా ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది. ఇది కంపెనీ మొత్తం సిబ్బందిలో దాదాపు సగం కాగా, గత దశాబ్ద కాలంలో టెక్ రంగంలో జరిగిన అతిపెద్ద లేఆఫ్స్‌లో ఒకటిగా నిలిచింది.

సాధారణంగా ఆర్థిక నష్టాల్లో ఉన్నప్పుడు కంపెనీలు ఉద్యోగులను తొలగిస్తాయి. కానీ, 'బ్లాక్' అందుకు భిన్నమైన నిర్ణయం తీసుకుంది. "మనుషుల కంటే ఏఐ టూల్స్ వేగంగా, సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. చిన్న బృందాలతో ఎక్కువ ఫలితాలు సాధించడమే మా లక్ష్యం" అని జాక్ డోర్సే ఉద్యోగులకు రాసిన లేఖలో స్పష్టం చేశారు. ఈ పరిణామం టెక్ రంగంలో 'మనిషి స్థానంలో మెషీన్' అనే చర్చను మరోసారి తీవ్రతరం చేసింది.

ఉద్యోగాలు కోల్పోయిన వారికి కంపెనీ అండగా ఉంటుందని డోర్సే భరోసా ఇచ్చారు. వారికి 20 వారాల పూర్తి జీతంతో పాటు, కంపెనీలో పనిచేసిన ప్రతి ఏడాదికి అదనంగా ఒక వారం జీతం ఇవ్వనున్నట్లు తెలిపారు. అంతేకాకుండా, ఆరు నెలల పాటు ఆరోగ్య బీమా, ఇతర ఖర్చుల కోసం 5,000 డాలర్లు (సుమారు రూ. 4.15 లక్షలు) నగదు అందజేయనున్నారు.

ఈ లేఆఫ్స్ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో 'బ్లాక్' కంపెనీ షేర్ల విలువ 27 శాతం మేర అనూహ్యంగా పెరిగింది. ఖర్చులు తగ్గి లాభాలు పెరుగుతాయన్న అంచనాతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు మొగ్గుచూపారు. ప్రస్తుతం సిలికాన్ వ్యాలీలోని గూగుల్, అమెజాన్ వంటి అనేక దిగ్గజాలు కూడా ఇదే బాటలో పయనిస్తున్నాయి.  

Jack Dorsey
Block layoffs
Block company
artificial intelligence
AI
fintech
layoffs
stock market
Silicon Valley
job cuts

More Telugu News